
కలకత్తాలోని సిమ్లా అనే పేటలో దత్త వంశస్థులైన, కాయస్థ క్షత్రియులైన విశ్వనాధ దత్తా, భువనేశ్వరీ దేవీ అను పుణ్య దంపతులకు పరమేశ్వరుని వరప్రసాదంతో 1863 జనవరి 12 వ తేదీ మకర సంక్రాంతి పర్వదినమున -- మేధస్సులో శంకరాచార్యుడు, త్యాగములో గౌతమ బుద్ధుడు, శౌర్యములో ఛత్రపతి శివాజీ గుణములు కలిగిన శ్రీ స్వామి వివేకానంద భారతజాతికి ఆశాజ్యోతిగా ఉదయించాడు. విశ్వేశ్వర శంభూతుడు కావడం వలన ' వీరేశ్వరుడు ' అను నామకరణం చేసి నరేన్, బిలే అని ముద్దుగా పిలిచేవారు. వివేకానందునిగా మార్పు చెందేవరకు "నరేంద్రనాధ్ దత్తా"గా పిలవబడ్డాడు.
బాల్యదశలో ధ్యానాన్నిబాల్యక్రీడగా నరేంద్రుడు భావించేవాడు. విద్యావాచస్పతి అయిన నరేంద్రుడు సంస్కృత వ్యాకరణము, రామాయణం, మహాభారతంలలో అనేక భాగాలను ఏడవ ఏటనే కంఠస్తం చేసాడు. "రాజసభ" అనే ఆటను నరేంద్రుడు ఇష్టంగా ఆడేవాడు. గోళీలు, దుమకడం, కుస్తీలు పట్టడం మొదలైన ఆటల పట్ల అమిత ఆసక్తి చూపేవాడు. ఒకరోజు పూజామందిరం మెట్లనుండి నరేంద్రుడు జారిపడ్డాడు. కంటి వద్ద గాయమైంది. తరువాత కాలంలో శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రుని శక్తీ సామర్ధ్యాలు ఈ గాయంతో నిరోధించకపోతే అతడి వల్ల లోకం అల్లల్లాడిపోయేది అన్నారు.
వివేకానందుడు యవ్వనంలోకి అడుగుపెట్టగానే సూర్యకాంతి పడి మెరిసే రత్నంలా నూతన వికాసాన్ని పొందాడు. పాఠ్య పుస్తకాలతో తృప్తి పడక, ప్రామాణిక గ్రంధాలు చెదివేవాడు. నరేంద్రుని వద్ద వివాహ ప్రస్తావన వస్తే "నేను బ్రహ్మచర్య జీవితం గురుంచి చాలా ఆలోచించాను. కాలాన్ని ఎదిరించి నిలబడే బ్రహ్మచారి ఘనతే ఘనత. అందరివలె ఐశ్వర్య భోగాలకు ప్రాకులాడక శాశ్వతానంద ప్రాప్తికోసం యత్నిస్తాడు." అని సన్యాస జీవితములో కల గొప్పధనాన్ని వివరించి, సన్యాస జీవితముఫై తనకు గల అనురక్తిని వ్యక్తం చేసేవాడు.
సమస్త వేదాలు, శాస్త్రాలు, సమస్త విద్యలు భగవంతుని చూపకుంటే నిష్ప్రయోజనం. నేను భగవంతుని చూడాలి అనే పరమ సంకల్పంతో ఎందరో గురువులను ఆశ్రయించాడు. "మహాశయా, మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించేవాడు. కానీ భగవంతుణ్ణి చూసానన్నవారు లేరు. కలకత్తాలోని దక్షిణేశ్వరం వద్ద కాళికామాత గుడి పూజారైన శ్రీరామకృష్ణ పరమహంస గొప్పదనం గురించి విని ఆయనను కలిసి "మహాశయా! మీరు భగవంతుణ్ణి చూసారా?" అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస " నేను భగవంతుణ్ణి చూసాను. నీతో మాట్లాడినంత స్పష్టంగా నేను భగవంతునితో మాట్లాడాను." అని సమాధానం చెప్పారు. నరేంద్రుడు ఆనంద పరవశుడై తన సంకల్పం నెరవేరాలంటే ఆయన దగ్గర శిష్యరికం చేయాలని నిర్ణయించుకొని ఆయనను గురువుగా ఆరాధించాడు.
శ్రీరామకృష్ణుల మూలంగా నరేంద్రుని ప్రతిభాశయము, హృదయ వికాసము అఖండరీతిలో సమన్వయంగావించబడ్డాయి. శ్రీరామకృష్ణ పరమహంస కాశీపుర ఉద్యానవనమునందు 1886 ఆగస్టు 16వ తేదీన మహాసమాధి నొందారు. అప్పుడే స్వామిజీ తన మఠాన్ని కాశీపురం నుండి 'భార' నగరానికి మార్చారు. నరేంద్రుడు పరివ్రాజక సన్యాసిగా కాశీపురం, బృందావనం, ఆగ్రా, హరిద్వార్, హృషికేశి, రాధాకుండ మొదలైన అనేక క్షేత్రాలకు దేశం నలువైపులా తీర్థయాత్రలు చేశారు. 1892వ సంవత్సరంలో మద్రాస్ చేరుకొన్నారు. అక్కడ క్షేత్రి మహారాజు కోరిక మేరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన "వివేకానంద" నామాన్ని స్వీకరించారు. 1893వ సంవత్సరం మే 1న విశ్వమత మహాసభకు "సనాతన ధర్మ ప్రతినిధిగా" బొంబాయి నుండి చికాగో బయలుదేరారు.
Comments
Post a Comment